Reading Time: < 1 minute

Breaking Update : డిజిటల్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో బ్యాంకుల పనితీరుపై Supreme Court of India తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజల నుంచి నేరగాళ్లు రూ.54 వేల కోట్లకు పైగా దోచుకున్న ఘటనలను కేవలం నేరాలుగా కాకుండా “పచ్చి దోపిడీ”గా ధర్మాసనం అభివర్ణించింది.

ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి కఠినమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశించింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మొత్తం పలు చిన్న రాష్ట్రాల బడ్జెట్‌లకన్నా ఎక్కువని, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం లేదా కుమ్మక్కుతోనే ఇలాంటి భారీ మోసాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది.

ఖాతాదారుల డబ్బును కాపాడాల్సిన ట్రస్టీలుగా వ్యవహరించాల్సిన బ్యాంకులు వ్యాపార ధోరణితో నేరగాళ్లకు ఈజీ మనీ ట్రాన్స్‌ఫర్ వేదికలుగా మారుతున్నాయని విమర్శించింది. పెన్షనర్ ఖాతాలో సాధారణంగా తక్కువ లావాదేవీలే ఉంటే ఒక్కసారిగా రూ.50 లక్షలు లేదా కోటి రూపాయలు విత్‌డ్రా చేసినప్పుడు ఏఐ అలర్ట్‌లు ఎందుకు స్పందించడం లేదని కోర్టు ప్రశ్నించింది. “డిజిటల్ అరెస్ట్” మోసాల్లో నేరగాళ్లు పోలీసులు, కోర్టు అధికారులుగా నటిస్తూ ఆడియో, వీడియో కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది.

అనుమానాస్పద లావాదేవీలపై డెబిట్ హోల్డ్ విధించే ఎస్‌వోపీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని హోం శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసుల దర్యాప్తుకు అనుమతించాలంటూ గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలను కోరింది. బాధితులకు పరిహారం ఫ్రేమ్‌వర్క్‌పై Reserve Bank of India, Department of Telecommunicationsతో సమావేశం నిర్వహించాలని ఆదేశిస్తూ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.