జగిత్యాల జిల్లా కేంద్రం
మార్చి 18,2023
పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించి అమలుచేయాలని
సీఐటీయూ జగిత్యాల జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన అన్నారు.
జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న 50 మంది పశు మిత్రులు శనివారం తెలంగాణ రాష్ట్ర పశుమిత్రల వర్కర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ కన్వీనర్ సులోచన ఆధ్వర్యంలో జగిత్యాలలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు రమేష్,సులోచన, పశుమిత్ర యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీరాం పద్మలు
మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పశు సంవర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న పశుమిత్రలు జంతువులకు ఆరోగ్యపరమైన సేవలు అందిస్తున్నారని, ఎలాంటి పారితోషకం లేకుండా వెట్టిచాకిరీతో రాష్ట్ర ప్రభుత్వం చేయించుకుంటున్నదని ఆరోపించారు.
ఈ డిపార్ట్మెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది పశుమిత్రులు గత 8 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారని, ఎక్కువ మంది మహిళలు బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారని వారు తెలిపారు.
వీరికి ఐకెపి ద్వారా ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పారితోషికాలు నిర్ణయించకుండా పశువైద్య శాఖలో పశుమిత్రులుగా నియమించారని, వీరు వారికి కేటాయించిన ఊరుతో పాటు సబ్ సెంటర్ పరిధిలోని రైతులకు సంబంధించిన జంతువుల ఆరోగ్య సమస్యలను పర్యవేక్షిస్తుంటారని రమేష్ , సులోచన, పద్మలు తెలిపారు.
పశుపోశకులకు – పశు సంవర్ధక శాఖల మధ్య వారధిలా పశుమిత్రలు పనిచేస్తూ పశువులకు వైద్య సేవాలాందిస్తున్నారని వివరించారు. రాత్రనక పగలనక ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి పాడి పశువులు, జంతువులకు వైద్యపరమైన సేవలు అందిస్తున్నా వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పారితోషకం లేకుండా పశుమిత్రులతో వెట్టి చాకిరి చేయించుకోవడం చాలా బాధాకరమన్నారు.
ఆశ వర్కర్ల మాదిరిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వేతనం నిర్ణయం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. దేశఉత్పత్తిలో రెండవ భాగంగా ఉన్న పశు సంపదను పరిరక్షిస్తున్న పశుమిత్రలు కనీస వేతనం, పని భద్రత కల్పించకపోవడం శోచనియమని పేర్కొన్నారు. అడగకుండానే అన్నీ సమస్యలు పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పశుమిత్రలను విస్మరించడం సరికాదన్నారు.
వేతనం నిర్ణయించకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం చాలా దుర్మార్గమని చెబుతూ రాబోయే రోజుల్లో పశుమిత్రలు పోరాట మార్గం ద్వారా హక్కులు సాధించుకుంటారని వారికి సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. వెంటనే ప్రభుత్వం పశుమిత్రలను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో సరిత, కడారి లావణ్య, వైష్ణవి, మమత, శైలజ, లత, గోపినవేణి సరితలు పాల్గొన్నారు.