ప్రజా రవాణాలో భద్రత ముఖ్యమని, అనుమతి లేని వాహనాలలో ప్రజా రవాణా చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. ప్రాణం ఎంతో విలువైనదని, వారిపై ఒక కుటుంబం ఆధారపడి ఉంటుందని కాబట్టి ప్రైవేట్ పాసెంజర్ వాహనాల డ్రైవర్లు భద్రంగా డ్రైవ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లకుండా ఆర్.టి.సి. రవాణ శాఖ, పొలిసు అధికారులు సమిష్టిగా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి అక్రమ రవాణా అరికట్టడం పై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
అనుమతి లేని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణికులను చేరవేయొద్దని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దన్నారు. ఆయా విషయాలపై ప్రైవేట్ వాహన యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రైవేట్ వాహన యజమానులు అనదికారికంగా వాహనాలు నడపకుండా ప్రజారవాణా చేయకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్, రవాణా శాఖల దని అన్నారు. బస్టాండ్ కు 500 మీటర్ల దూరం వరకు ప్రైవేట్ వాహనాలలో ప్రయాణికులను ఎక్కించుకో రాదని ప్రైవేట్ వాహనదారులకు తెలుపాలని చెప్పారు. అనుమతి పత్రాలు లేని వాహనాలు ఎక్కువగా తిరిగే రూట్లలో రవాణా, పోలీస్, ఆర్టీసీ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని వారు ఆదేశించారు. వైట్ ప్లేట్ ఉన్న సొంత వాహన యజమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికులను వారి వాహనంలో ఎక్కించుకో రాదని స్పష్టం చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేస్తున్న , అనుమతి లేని వాహనాలను స్వాధీనపరచుకొని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మానవ తప్పిదాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుచున్నాయని, జాతీయ రహాదారుల వెంట ఉన్న గ్రామాలకు నిర్మించిన అండర్ పాస్ లను వాహనదారులు ఉపయోగించేలా అవాగాహన కలిగించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఆర్.టి.సి. రీజనల్ మేనేజర్ సుదర్శన్, డిపో మేనేజర్ రవి చందర్, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.