ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తూ పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి 94 వినతులు స్వీకరించారు. ఇందులో ధరణికి సంబంధించి 50, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి 20, పింఛన్లకు సంబంధించి 5, కాగా ఇతర శాఖలకు సంబంధించి వచ్చిన 19 వినతులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు.

అనంతరం అధికారులనుద్దేశించి మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను మరింత మెరుగ్గా, సమర్థవంతంగా నిర్వహించేలా మండల ప్రత్యేకాధికారులు చొరవ చూపాలని , దూరపు చూపు, దగ్గరి చూపు పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేలా, అవసరమైన మందులు, రీడింగ్ అద్దాలు శిబిరాలలో స్టాక్ పెట్టుకునేలా చూడాలన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాలలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తారని మహిళలకు అవగాహన కలిగిస్తూ ఎక్కువ మంది ఉపయోగించుకునేలా చూడాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని, తేమ కాస్త అటుఇటు ఉన్న ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు ధాన్యం తరలించి, టాబ్ ఎంట్రీ 24 గంటలలోగా చేయాలని అన్నారు. ప్యాడి క్లినర్ ల ద్వారా తాళ్లు లేకుండా ధాన్యం వచ్చేలా చూడాలని, రైస్ మిల్లర్లు కూడా వెంటనే ధాన్యం దించుకునేలా ప్రతినిత్యం పర్యవేక్షించాలని మండల ప్రత్యేకాధికారుల కు సూచించారు. మంగళవారం నుండి మండలాలలో నిర్వహించే సమావేశాలలో గ్రామ పంచాయతీ పనులకు సంబంధించి డబ్బులు రెండు, మూడు వారాలలో వస్తాయని సర్పంచులకు భరోసా కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పధకం క్రింద చేపట్టిన పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. ఈ.జి.ఎస్. క్రింద శ్రామికులకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. పెండింగ్ ఉన్న 42 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. ఈ నెల 15 నుండి 17 వరకు సి.ఏం. కప్ ను కోకో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్ అథ్లెటిక్స్ అంశాలలో అన్ని మండలాలలో నిర్వహిస్తున్నామని, అక్కడ విజేతలకు జిల్లా కేంద్రంలో 22 నుండి 24 వరకు పోటీలు నిర్వహిస్తున్నామని, అందుకు మండల స్థాయిలో చక్కటి ఏర్పాట్లు చేయాలని, పాల్గొన్న అందరికి సెర్టిఫికెట్ ప్రధానం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు వెంకట శైలేష్, శ్రీనివాస్, సాయిబాబా, రవి పాల్రాసాద్, జయరాజ్, విజయ శేఖర్ రెడ్డి, కృష్ణ మూర్తి, రజాక్, జెంలా నాయక్, ఆశా కుమారి, కరుణ, విజయలక్ష్మి, బ్రహ్మాజీ, రజిని, , నాగరాజ్, జానకి రామ్ సాగర్, డా. నవీన్, సుధాకర్, శశికుమార్, తదితరులు పాల్గొన్నారు.