చంద్రుడి దక్షిణ ధృవం నిమిత్తం పరిశోధన కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. సాయంత్రం 6:04 నిమిషాలకు విక్రమ్ జాబిల్లిపై ల్యాండ్ కాగా.. రాత్రి 10 గంటల ప్రాంతంలో రోవర్ బయటకు వచ్చింది. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తున్న వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది.
ఇందులో ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ నెమ్మదిగా బయటకు వచ్చి, ట్రాక్ పైన ప్రయాణిస్తూ జాబిల్లిపై అడుగుపెట్టడం కనిపిస్తోంది. చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు సంబంధించి శుక్రవారం ఉదయం చేసిన ట్వీట్‌ను ఇస్రో తొలగించింది. దీనికి కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇస్రో తొలగించిన ఆ ట్వీట్లో ఏముందంటే.. చంద్రయాన్ -3 ల్యాండర్ విక్రమ్‌ను చంద్రయాన్-2 ఆర్బిటర్ ఫొటో తీసిందని ఇస్రో పేర్కొంది. ‘నువ్వెప్పుడూ నా నిఘా పరిధిలోనే ఉంటావు” అంటూ క్యాప్షన్ జతచేసి ఈ ఫొటోను ట్విట్టర్లో పెట్టింది. ఆపై కాసేపటికే ఈ పోస్టును తొలగించింది.