మెదక్ జిల్లా కేంద్రం
మే 2, 2023
✍️ భైరవ్ రెడ్డి
ఆపదలో ఉన్న వారిని రక్షించి తీసుకువచ్చిన బాధితులకు సఖి కేంద్రాం ద్వారా కౌన్సిలింగ్ అందించడంతో పొలిసు, న్యాయ సహాయం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
మంగళవారం మెదక్ పట్టణంలో స్వాడ్ యెన్.జి.ఓ. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖి కేంద్రాన్ని జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న పలు రికార్డులను పరిశీలించి పక్కాగా నిర్వహిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షించి కేంద్రానికి తీసుకువచ్చిన బాధితులకు వెంటనే కాస్మటిక్స్, బట్టలు తదితర కిట్లను అందించడంతో పాటు వైద్య సహాయం అందించాలని సూచించారు. కేంద్రం ద్వారా గృహ హింస, వరకట్న వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లల అమ్మకం, రవాణా నివారణ వంటి ఐదు రకాల సేవలు 24 గంటలు అందించే విధంగా అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటూ బాధితులకు సహాయం అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా రక్షించిన బాధితులకు కేంద్రంలో తాత్కాలిక వసతి కల్పిస్తూ అవసరమైన పొలిసు, ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు సామాజిక కౌన్సిలర్ల ద్వారా మానసికంగా ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సఖి కేంద్రానికి వచ్చిన 833 కేసులలో 734 కేసులను పరిష్కరించామని, మరో 99 కేసులు పురోగతిలో ఉన్నాయని, వాటిపై సత్వర న్యాయం జరిగేలా చూడవలసినదిగా కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అన్నారు. కేంద్రానికి వచ్చిన లీగల్ కేసులు త్వరిగతిన పరిష్కరించాలన్నారు. సమాజంలో బాలికలు, స్త్రీలపై జరిగే హింసను ఆపుదాం… వారికి అండగా ఉందామని అన్నారు. మహిళలు కూడా ఆపద సమయంలో 181 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి రక్షణ, సలహా పొందాలని కలెక్టర్ అన్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సఖి కేంద్రం భవన నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతతో పనిచేయాలని, మే నెలఖారునాటికి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్వాడ్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి శివకుమారి, పంచాయత్ రాజ్ ఈ ఈ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ ఈ ఈ పాండురంగ రావు తదితరులు పాల్గొన్నారు.