రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో అన్ని ప్రభుత్వాసుపత్రులలో మౌలిక వసతులతో అన్ని సౌకర్యాలు కల్పించిందని, ఆ సేవలు రోగులకు అందేలా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులకు సూచించారు. రోగులను ప్రేమ, అప్యాయతతో పలకరిస్తూ వైద్యం అందించాలని, అదే వారిలో సగం ధైర్యం వస్తుందని అన్నారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వివిధ వార్డులను, ల్యాబ్ లను, ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించారు. థియేటర్ లో ఆపరేషన్ కు కావలసిన అన్ని ఎక్విప్మెంట్ మంచి కండిషన్ లో ఉండాలని, సాంకేతిక సిబ్బంది సకాలంలో వచ్చేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రికార్డులను పరిశీలించి ఆసుపత్రికి వస్తున్న అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి ఏ జబ్బు ఉంది.. వైద్యులు సమయానికి వచ్చి పరీక్షిస్తున్నారా.. నర్సులు ఇంజెక్షన్, మందులు టైం కు అందిస్తున్నారా .. ఇప్పుడు ఆరోగ్య ఎలా ఉంది.. టిఫిన్ ఇస్తున్నారా .. అని వివరాలడుగుతూ పేషంట్ కేస్ షీట్లను పరిశీలించారు. కొందరు రోగులకు అల్పాహారం అందకపోవడం పట్ల నర్సులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెనూ ప్రకారం రోగులకు అల్పాహారం, భోజనం అందించాలని, ఇందుకు సంబంధించి ప్రతి వార్డులో డైట్ మెనూ ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. ఎల్లప్పుడూ వార్డులు, శౌచాలయాలు పరిశుభ్రంగా ఉండేలా ర్యాండమ్ గా పర్యవేక్షిస్తుండాలని అన్నారు.
శిథిలావస్థలో ఉన్న పాత డయాలసిస్ సెంటర్ భవనాన్ని తక్షణమే డిస్మెంటల్ చేయుటకు ప్రతిపాదనలు పంపవలసినదిగా ఆదేశించారు. వర్షాకాలం వచ్చే జూన్ లోపు వాటర్ లీకేజీలను అరికట్టాలని అన్నారు. ఆసుపత్రి మొదటి అంతస్తులో చిన్న పిల్లలకు వైద్యం అందించుటకు నిర్మించబోయే ఎర్లీ డిటెక్షన్ సెంటర్ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టాలని టీఎస్ ఏం డి సి ఈ ఈ రవీందర్ రెడ్డికి సూచించారు.
కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చందు నాయక్, ఈ ఈ రవీందర్ రెడ్డి తదితరులున్నారు.