జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో భాగంగా కమ్యూనిటీ స్థాయిలో ఆరోగ్య పరిరక్షణ పై అవగాహన కలిగించుటకు ప్రతి నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలలో కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులకు సూచించారు.
శుక్రవారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన జిల్లా హెల్త్ సొసైటీ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచినీరు, కుర్చీలు, శౌచాలయాలు వంటి కనీస మౌలిక వసతులు ఉన్నాయా, గర్భిణీ స్త్రీలు సాధారణ ప్రసవానికి చేయవలసిన వ్యాయామాలు, రక్తహీనతతో బాధపడుతున్నగుర్తించి సరైన వైద్య సహాయం అందించుట వంటి అంశాలను ప్రతి నెలా చర్చించి తగు తీర్మానాలు చేయుటకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య ఉప కేంద్రం స్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో మండల ప్రజా పరిషద్ అధ్యక్షతన జన్ ఆరోగ్య్ సమితి పేర కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించిందని అన్నారు.
అదేవిధంగా జిల్లాలోని ఆసుపత్రులలో రోగులకు వైద్య సౌకర్యాలు ప్రభుత్వ నిబంధనల మేరకు అందుతున్నాయా, భోజనం, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయా, మెరుగుపరచడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా హెల్త్ సొసైటీ కమిటీ, ఏరియా ఆసుపత్రులలో యు.ఎల్.బి. అధ్యక్షతన రోగ్ కళ్యాణ్ సమితి పేర కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించిందని, అందులో భాగంగా నేడు జిల్లా స్థాయి హెల్త్ కమిటీ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీలు ప్రతి నెలా సభ్యులతో పాటు మహిళా శిశు సంక్షేమం , జిల్లా పంచాయతీ, విద్య తదితర శాఖల తో సమావేశం ఏర్పాటు చేసి ఎజెండా ప్రకారం చర్చించి రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, పారిశుద్యం, ఆసుపత్రి అభివృధికి చేపట్టవలసిన కార్యక్రమాలు, ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలపై చర్చించి తీర్మానాలు చేసి అమలు పర్చాలన్నారు.
ప్రతి పి .హెచ్.సి. కాయకల్ప ఎంపికయ్యేలా చూడాలన్నారు. అల్లాదుర్గ్ , రంగంపేట, ఎల్దుర్తి పిహెచ్.సి. భవన నిర్మాణ మరమ్మతు పనులు ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్, డీఈఓ రాధాకిషన్, డిపిఓ సాయిబాబా, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ లు విజయనిర్మల, అనిల తదితరులు పాల్గొన్నారు.