మెదక్ జిల్లా
మే 18, 2023
కంటి వెలుగు కార్యక్రమం మన ఇంటికే వెలుగు లాంటిదని, కంటి చూపు పట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలో 79 రోజుల నుండి నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తున్నదని, ఇదే స్పూర్తితో జూన్ 15 వరకు కొనసాగు కంటి వెలుగు శిబిరాలను అత్యంత మెరుగ్గా, ఫలవంతంగా నిర్వహిస్తూ గ్రామాలలో 18 ఏళ్ళు పైబడిన అందరు కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
గురువారం నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట లో కంటి వెలుగు శిబిరాన్ని, నర్సరీని, సేగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామలను, నర్సాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, పెద్ద చింత కుంట లో రైస్ మిల్లును ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…
గత జనవరి 19 నుండి నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల పట్ల ప్రజలకు అవగాహన ఉండడంవల్ల స్వచ్ఛందంగా శిబిరాలకు తరలివస్తు నేత్ర పరీక్షలు చేసుకుంటున్నారని, శిబిరాలలో మొబిలిజెషన్ కూడా బాగున్నదని అన్నారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును, రికార్డులను, కంటి అద్దాలు, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ రీడింగ్ అద్దాలు స్టాక్ లో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 415 జిపిలు, 73 వార్డులలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించి 4,17,365 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 44,308 మందికి రీడింగ్ అద్దాలు, 34,093 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామని, మరో 11,707 మందికి త్వరలో అందజేయనున్నామని అన్నారు. కాగా ఇప్పటి వరకు నేత్ర పరీక్షలుచేసుకున్నవారిలో 3,27,240 మందికి ఎటువంటి సమస్యలు లేవని నిర్దారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం వైకుంఠ ధామాన్ని పరిశీలించి బోర్ పంపు సెట్ కు వెంటనే విద్యుత్ సౌకర్యం కలిగించి వాడుకలోకి తేవాలని సూచించారు. డంప్ యార్డ్ ను పరిశీలించి తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు పొడిచెత్తను ఎరువుగా విక్రయించి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా వర్షాకాలానికి ముందే గ్రామాలలో పారిశుధ్య పనులు చేపట్టుటకు ప్రభుత్వం ఈ నెల 17 నుండి వారం రోజుల చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అవసరమైతే లేబర్ ను ఎంగేజ్ చేయాలన్నారు.
ఈ సందర్భంగా సైడ్ డ్రైన్స్ క్లినింగ్ పనుల ను పరిశీలించారు. ఆ తరువాత నర్సరీని పరిశీలించి అవెన్యూ ప్లాంటేషన్ కు టేకోమా, కానుగ వంటి పెద్ద మొక్కలు లేకపోవడాన్ని గమనించి పక్క నర్సరీల నుండి అనువైన మొక్కలు సేకరించి తరలించుటకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇంటింటికి ఆరు రకాల మొక్కల పంపిణీకి పెంచుతున్న పండ్లు, పూల మొక్కలను పరిశీలించారు. అనంతరం నర్సాపూర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి పనులు వేగవంతం చేసి సెప్టెంబర్ నాటికి 224 ఇండ్లు పూర్తి చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని పంచాయత్ రాజ్ ఈ ఈ కి సూచించారు. ఆ తరువాత చిన్న చింతకుంట లోని మహాలక్ష్మి రైస్ మిల్ ను సందర్శించి పెండింగ్ ఉన్న సి.యం .ఆర్. రైస్ ను రోజు 170 మెట్రిక్ టన్నుల చొప్పున ఈ నెలాఖరు వరకు ఎఫ్.సి.ఐ. కి తరలించాలని యాజమాన్యానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చందు నాయక్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డిపిఓ సాయిబాబ, పంచాయత్ రాజ్ ఈ ఈ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ విజయనిర్మల, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, తహశీల్ధార్, ఎం .పి .డి.ఓ. సర్పంచ్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.