‘పుష్ష 2’ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం కంక‌ణం క‌ట్టుకొంది. అందుకు త‌గ్గ‌ట్టే రాత్ర‌న‌క, ప‌గ‌ల‌న‌క ప‌ని చేస్తోంది. ఈ సినిమా కోసం మ‌లేషియాలో కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించాల‌నుకొన్నారు. అయితే ఇప్పుడు అంత టైమ్ లేదు. అందుకే హైద‌రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీనే మ‌లేషియాగా మారుస్తున్నారు. అక్క‌డ ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. అక్క‌డే మ‌లేషియాలో తెర‌కెక్కించాల్సిన సీన్స్ షూట్ చేస్తున్నారు.

‘పుష్ష 2’ షూటింగ్ ఎంత చ‌క‌చ‌క సాగుతున్నా, టీమ్‌ని రెండు విష‌యాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒక‌టి.. ఫ‌హ‌ద్ ఫాజిల్ ఈ సినిమాకు డేట్లు కేటాయించ‌డం లేదు. ఈ సినిమాలో ఫ‌హ‌ద్ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌పై ఇప్ప‌టికే కొంత‌మేర షూటింగ్ చేశారు. అయితే మ‌రో 15 రోజుల కాల్షీట్లు అవ‌స‌రం అయ్యాయి. కానీ ఫ‌హ‌ద్ కు ఉన్న బిజీ వ‌ల్ల డేట్లు కేటాయించ‌డం లేదు. మ‌రోవైపు ఐటెమ్ గాళ్ స‌మ‌స్య కూడా వెంటాడుతోంది. ఈ సినిమా కోసం ఐటెమ్ గాళ్ గా ఎవ‌రిని తీసుకోవాల‌న్న విష‌యంలో ఓ స్ప‌ష్ట‌త రాలేదు. చాలామంది అగ్ర క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీలించారు. కానీ కుద‌ర‌డం లేదు. ఎవ‌రూ దొర‌క‌ని ప‌క్షంలో ఈ పాట‌ని జాన్వీక‌పూర్‌తో లాగించేయాల‌ని భావిస్తున్నారు. ఐటెమ్ గాళ్ విష‌యంలోనూ ఈ వారం, ప‌ది రోజుల్లో ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ‘పుష్ష 2’ నుంచి టైటిల్ గీతం విడుద‌లైంది. ఈ సినిమా నుంచి మ‌రో పాట‌ని విడుద‌ల చేసే స‌న్నాహాల్లో ఉంది చిత్ర‌బృందం.